“Book Descriptions: అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓమూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి, మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి.
ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి "-ఏంచేస్తావే ఇన్ని కట్టెలూ...?"అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ.
ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి"రేపు నువ్వు హరీ అంటే చితిపేర్చడానికి కావద్దూ..." అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ- ఆయన ఏమాత్రం చలించకపోగా ఫెళఫెళా నవ్వి -"హసి నీ దుంపతెగా- నీకెంతముందు చూపే ముసలి ఘటమా..." అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి "చూశావురా-మీ అత్తయ్య పాతివ్రత్యం! సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రి మొహంది- లేకపోతే యీ ఒక్క కట్టెకి యిన్ని కట్టెలు కావాలిట్రా...?" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ- ఆ మాటకు నాకూ నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్లు కొరకబోయి పెదాలతో నాలిక్కరుచుకుంది. ఖోపంగా మెటికలు విరిచి అవీ కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక "అబ్బో! సరసాలకేం తక్కువలేదు. బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు... ఒక నగనా- ఒక నట్రనా -కాపరానికొచ్చి అరవయ్యేళ్ళు అయింది. ఒక ముచ్చటా అచ్చటా-ఒక రొచ్చారనా ఒకరు పోయారనా- ఒక తీర్థమా ఒక శార్థమా-" ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. ....” DRIVE