“Book Descriptions: ''నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్‌కి సంబంధించినది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాదీ, ఫలితం నీదీ అన్న సంగతి మర్చిపోకు''. క్రమశిక్షణ అనే జైలులో పెరుగుతున్న కూతురు మీనాతో తల్లి కృష్ణవేణి అన్నమాటలివి.
కొన్ని పట్టుదలలుంటాయి. జీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైనా జ్ఞాపకాలలో అప్పుడప్పుడూ కదులుతాయి. కానీ పసితనంలో కృష్ణకి మేనత్త కృష్ణవేణమ్మ వల్ల జరిగిన అవమానం అహర్నిశలూ గుర్తొస్తూ రక్తాన్ని మరిగించే పట్టుదలగా మారింది. కాని మేనత్త కూతురు మీనాని చూశాక మనసులో ఏదో తియ్యటి సంచలనం తలెత్తింది.
కొన్ని మనస్తత్వాలుంటాయి. ఇంకో పిల్లపుడుతే వున్న ఒక్క కూతురు మీనా మీద ప్రేమ తరిగి పోతుందేమో, తన తల్లి ప్రేమని భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది. తన మనస్సు, కూతురు మనస్సు ఒక్కటేనని, తనకి నచ్చిన భవిష్యత్తునే కూతురికి అందించాలని, మీనాకు నచ్చని సారథిని అల్లుడిగా ఎంచుకున్న విచిత్రమైన మనిషి ఆమె.